Advertisement

సిద్దిపేట యువతేజాల ప్రతిభ



 సిద్దిపేటకు చెందిన యువతేజాలు సాయికృష్ణ, మహ్మదీయ ఆప్సానాజ్‌...! 

తాజాగా బీటెక్‌ పూర్తి చేసిన ఈ విద్యార్థులపై ఐటీ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ఉన్నతాధికారి జయేశ్‌ రంజన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 

సామ్‌సంగ్‌ టైజన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా వీరు భగవద్గీత, అల్‌-ఖురాన్‌ యాప్‌ తయారు చేసి ప్లే స్టోర్‌లో నిక్షిప్తం చేయడంతో వారికి ఆ గౌరవం దక్కింది. ఇటీవల మధ్య టాస్క్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యాప్‌ను ప్రదర్శించారు. 

రెండు నెలల వ్యవధిలో వారంలో మూడు రోజుల చొప్పున నిత్యం ఎనిమిది గంటల పాటు శ్రమించి యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ ప్రత్యేకత ఏంటి..? దీన్ని రూపొందించడానికి వారు శ్రమించిన తీరుపై ’ ప్రత్యేక కథనం.

సామ్‌సంగ్‌ కంపెనీ దేశవ్యాప్తంగా టైజన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై 2015-16 విద్యా సంవత్సరంలో వేలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. అందులో భాగంగా సిద్దిపేట శివారులోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ ఈ ప్రక్రియ చేపట్టింది. ఈ సందర్భంగా చక్కటి యాప్‌ తయారు చేసిన వారికి బహుమతులు ఇస్తామని ఈ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన సాయికృష్ణ, మహ్మదీయ అప్సానాజ్‌లు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించారు. భగవద్గీత, అల్‌-ఖురాన్‌లతో కూడిన యాప్‌ తయారు చేస్తే మంచి స్పందన వస్తుందన్న నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా వీరిద్దరు విద్యార్థులు ఆ పనిలో నిమగ్నం అయ్యారు.

  • తెలుగు, హిందీ, ఆంగ్లం, గుజరాతి, మరాఠీ భాషల్లోని భగవద్గీత ఆడియోను సేకరించి వీరు ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. భగవద్గీత ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను కూడా అప్‌లోడ్‌ చేశారు. 

  • 18 పర్వాలకు సంబంధించిన శ్లోకాలను వినవచ్చు. వృద్ధులు, చదువురాని వారి కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇక చదువు వచ్చిన వారిలో కూడా చాలా మంది చదవాలన్న ఓపిక ఉండదు. చేతిలోని ఫోన్‌లో ఈ యాప్‌ను ఆన్‌చేస్తే చాలు వినే అవకాశం ఉండడంతో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపట్టారు. 

  • భగవద్గీతలోని అన్ని శ్లోకాలను ఆంగ్లంలో టైప్‌ చేసి ఈ అప్లికేషన్‌లో పొందుపర్చారు. ఇలా ఐదు భాషల్లో భగవద్గీత వినడం, ఆంగ్లంలో చదివే అవకాశం ఉన్న తొలి యాప్‌ ఇదేనని విద్యార్థులు వెల్లడించారు.



  • ఇక ఖురాన్‌లోని అన్ని అంశాలను అరబిక్‌లో వినడం, ఆంగ్లంలో చదివేలా యాప్‌ తయారు చేశారు. ఇందులో నమాజు ఎలా చేయాలి..? అనే వివరాలతో పాటు మతగురువుల ప్రవచనాలు కూడా ఉన్నాయి. 

  • ఖురాన్‌లోని అంశాలను టైప్‌ చేసి పొందుపర్చారు.ఇలా ఒకే యాప్‌ ద్వారా భగవద్గీత, ఖురాన్‌లను వినడం, చదవడం వంటివి చేసే అవకాశం దీని ద్వారా దక్కింది. 


వీరు తాజాగా బీటెక్‌ పూర్తి చేసినా కళాశాలలో ఉండగానే యాప్‌ను సామ్‌సంగ్‌ కంపెనీకి పంపించారు. టాస్క్‌లో ఈ మధ్య జరిగిన ప్రదర్శనలో రాష్ట్రంనుంచి 500 మంది విద్యార్థులు రూపొందించిన అప్లికేషన్లు ప్రదర్శించగా...సిద్దిపేట విద్యార్థులకు మొదటి బహుమతి రావడం విశేషం. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌, ఉన్నతాధికారి జయేశ్‌ రంజన్‌లు సాయికృష్ణ, మహ్మదీయ అప్సానాజ్‌తో పాటు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రభుజి.బెన్‌కాక్‌కు ప్రశంసపత్రాలు, జ్ఞాపికను అందించారు. భవిష్యతులో మరిన్ని చక్కటి యాప్‌లు తయారు చేస్తామని ఈ విద్యార్థులు అంటున్నారు. హిందువుల పవిత్రగ్రంథం భగవద్గీత, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను వినాలి, చదవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. ఆ కోరికను ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు తీర్చడం విశేషం.

Post a Comment

0 Comments