Advertisement

పేట బల్దియాకు స్కోచ్‌ పురస్కారం

సిద్దిపేట పురపాలిక జాతీయ స్థాయి స్కోచ్‌ పురస్కారానికి ఎంపికయింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మలవిసర్జన రహిత అంశంలో సత్తా చాటినందుకు స్కోచ్‌ సంస్థ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈమేరకు పురపాలిక కమిషనర్‌కు శుక్రవారం లేఖ అందింది. వరుసగా అయిదో సంవత్సరం సిద్దిపేట పట్టణం వివిధ విభాగాల్లో స్కోచ్‌ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. 2018లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో దక్షిణాదిలో మొదటి స్థానంలో నిలిచిన సిద్దిపేట.. 2019 ఆరంభంలోనే మరో ఘనత సాధించడం విశేషం. పట్టణంలో స్వచ్ఛత పెంపు, ఘన వ్యర్థాల నిర్వహణపై దాదాపు పదేళ్లుగా అధికారులు, మహిళ సంఘాల ప్రతినిధులు, పాలక వర్గం చేస్తున్న కృషికి అయిదేళ్లుగా గుర్తింపు లభిస్తోంది. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దిశానిర్దేశంతో సిద్దిపేట రాష్ట్రంలోనే తొలి బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా గుర్తింపు సాధించింది. చెత్త సేకరణ, నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ రాజధానిలో వచ్చే నెల 25న బల్దియా అధికారులు పురస్కారం అందుకోనున్నారు.
కుటుంబాలు: 37,765
జనాభా: 1,38,690
నిత్యం చెత్త ఉత్పత్తి: 47.5 టన్నులు
పారిశుద్ధ్య కార్మికులు: 248
చెత్త సేకరణ వాహనాలు: 14
నెలకు సగటున సేంద్రీయ ఎరువు తయారీ: 60 టన్నులు
పొడి చెత్త సేకరణ ద్వారా నెలకు కార్మికుల ఆదాయం: రూ.3 లక్షలు

Post a Comment

0 Comments