చదువులమ్మ ఒడి సిద్దిపేట కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం బుధవారం ప్రారంభం కానుంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యకు బీజం పడనుంది. 2018-19 విద్యాసంవత్సరంలో ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కాగా, తాజాగా కేంద్రీయ విద్యాలయం ఆరంభం కానుంది. కొత్త జిల్లాగా ఆవిర్భవించిన రెండేళ్లకే కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం విశేషం. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవతో ఇది సాధ్యమైంది. ఈ విద్యాసంవత్సరం 1-5వ తరగతి వరకు ప్రారంభం కానుంది. మొత్తం 204 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేయనున్నారు. డే-స్కాలర్ పద్ధతిలోనే పాఠశాల కొనసాగనుంది. ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్లం, గణితం, హిందీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్...ఈ నాలుగు సబ్జెక్టులు బోధించనున్నారు. తాత్కాలిక పద్ధతిలో ఆరుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు, ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిని నియమించారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ నిర్దేశిత కాలవ్యవధిలో బోధిస్తారు. సిద్దిపేటలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల భవనంలో ఓ బ్లాక్‌ను అద్దెకు తీసుకున్నారు. అందులో 15 గదులు ఉన్నాయి. మార్చి 31తో విద్యా సంవత్సరం ముగియనుంది. ఆయా తరగతుల్లో ఈ పాటికే విద్యార్థులు వివిధ పాఠశాలల్లో పాఠ్యాంశాలు చదివి ఉంటారు. ఈ మూడు నెలల్లో సిలబస్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఒక్కో తరగతి పెంచుకంటూ పోతూ 10+2 స్థాయికి విద్యాలయాన్ని తీసుకెళ్తామని ప్రిన్సిపల్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా పాలనాధికారి కృష్ణభాస్కర్ విద్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Source: Eenadu
0 Comments