Advertisement

ఆర్టీఏ కార్యాలయంలో అనిశా ఆకస్మిక తనిఖీ కార్యాలయంలో ఎనిమిది మంది దళారులు రూ. 84 వేలు స్వాధీనం





పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖాధికారి కార్యాలయంలో అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. దళారీ వ్యవస్థ ఉందనే సమాచారంతో రెండు నెలలుగా నిఘా పెట్టిన అధికారులు శనివారం రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 12.30 - 2.30 గంటలకు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఎనిమిది మంది దళారుల నుంచి రూ.84 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనిశా సంగారెడ్డి డీఎస్పీ సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి దళారీ వ్యవస్థపై కొన్నాళ్లుగా నిఘా పెట్టామన్నారు. అధికారులు, దళారుల మధ్య సంబంధాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. దళారులను విచారించి దీనివెనుక ఎవరెవరు ఉన్నారనే సమాచారం సేకరిస్తామన్నారు. ఈ వ్యవస్థలో ఇంకా ఎవరైనా అధికారులు లంచం తీసుకున్నా సమాచారం అందించాలన్నారు. చర్యలు పకడ్బందీగా ఉంటాయన్నారు. లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఈ తనిఖీలని వెల్లడించారు. దళారులు స్టేట్‌మెంట్‌ ఇస్తే సాక్ష్యంగా పరిగణిస్తామని, సమాచారం ఇవ్వకుంటే క్రిమినల్‌ కేసులు చేసే ఆస్కారం ఉంటుందన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అవినీతిని నిరోధించేందుకు అందరూ సహకరించాలని, 94404 46149 చరవాణిలో సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీలో హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయం డీఎస్పీ సునీత, సీఐ నవీన్‌, కానిస్టేబుళ్ల బృందం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments