Advertisement

5 డివిజన్లు.. 6 మండలాలు కొత్త జిల్లాల ఏర్పాటుతో మారనున్న స్వరూపం

​మెతుకుసీమ మూడు జిల్లాలుగా తన స్వరూపాన్ని మార్చుకోనుంది. కొత్త జిల్లాలు దసరాలోగా అమల్లోకి వస్తాయన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తు ముమ్మరంకానుంది. జిల్లా, మండల కేంద్రాలకు దూరాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవడంతోపాటు అందుకు అనుగుణంగాలేని వాటిని సమీప మండలాల్లో కలిపితే ప్రయోజకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు ఇదే కోణంలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ కేంద్రాలుగా నూతన జిల్లాలతోపాటు అదనపు రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యే వీలుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... మూడు జిల్లాల ముచ్చట త్వరలోనే తీరనుంది.

రెండింటికీ ఒకటి!.. జిల్లాలో ప్రస్తుతం మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లుండగా కొత్తగా ఏర్పాటుకానున్న జిల్లాలతో వీటి సంఖ్య అయిదుకు చేరనున్నట్లు సమాచారం. అదెలాగంటే.. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటన్న మాట. ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనల ప్రకారం నూతనంగా ఆవిర్భవించే మెదక్‌ జిల్లాలో... మెదక్‌, నర్సాపూర్‌, అందోలు, సంగారెడ్డి జిల్లాలో... సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, సిద్దిపేట జిల్లాలో... సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాలు ఉండనున్నాయి. వీటితోపాటు సిద్దిపేటలో అదనంగాకరీంనగర్‌ జిల్లా మానకొండూరు, హుస్నాబాద్‌ నియోజకవర్గాలను కలిపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలను కలపాలని గతంలో ప్రతిపాదించారు. కానీ కామారెడ్డి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తోపాటు అందుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో మెదక్‌ కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, అందోలు నియోజకవర్గాలను మాత్రమే ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజను, సిద్దిపేట జిల్లాలో మానకొండూరు, హుస్నాబాద్‌ కలిస్తే గజ్వేల్‌ మరో రెవెన్యూ డివిజను అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అటూ.. ఇటూ! 

ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల మేరకు మెదక్‌ జిల్లాలో ఉండబోయే నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర, అందోలు నియోజకవర్గంలోని పుల్కల్‌ మండలాలు సంగారెడ్డికి అత్యంత చేరువలో ఉంటాయి. వీటిని సంగారెడ్డి జిల్లాలో కలిపేందుకే ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. అలాగే దుబ్బాక నియోజకవర్గంలోని మండల కేంద్రం చేగుంట.. జిల్లా కేంద్రం కానున్న సిద్దిపేటకు దాదాపు 63 కి.మీ. దూరంలో ఉండగా మెదక్‌కు 25 కి.మీ.లలోనే ఉంది. మండల కేంద్రమైన తూప్రాన్‌దీ ఇదే పరిస్థితి. దీంతో దగ్గర అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా మండలాలను మెదక్‌ జిల్లాలో కలుపనున్నారు. తొలుత ప్రకటించిన ముసాయిదా మేరకు పటాన్‌చెరును గోల్కొండ జిల్లాలో కలపాలని ప్రతిపాదించినా... సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా వరంగల్‌ జిల్లా చేర్యాల మండలాన్ని సిద్దిపేటలో కలపాలని ఇప్పటికే ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఎందుకంటే అది సమీపంలో ఉండటంతోపాటు ఆ మండలానికి చెందిన చాలా మంది వివిధ అవసరాల నిమిత్తం సిద్దిపేటపై ఆధారపడుతుంటమూ కారణంగా కనిపిస్తోంది.
కొత్త మండలాల ఆవిర్భావం: అర్బన్‌ మండలాలను ఏర్పాటు చేయనున్న క్రమంలో పటాన్‌చెరు, సిద్దిపేట, సంగారెడ్డి, జహీరాబాద్‌, మెదక్‌ కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోనే వైశాల్యంలో పెద్దదైన మనూరు మండలాన్ని సైతం రెండుగా విభజించే ప్రతిపాదనలున్నాయి. ఇక మండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలను సమీప మండలాల్లో కలిపేలా అధికారులు కసరత్తు చేయనున్నారు. ఇందుకు దూరాన్ని, రవాణా సదుపాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉదాహరణకు... చేగుంట మండల కేంద్రానికి దాదాపు 16 కి.మీ. దూరంలో ఉండే ఉప్పరిపల్లి, గోవిందాపూర్‌, కోనాయపల్లి తదితర గ్రామాలు దౌల్తాబాద్‌ మండలానికి 2-5 కి.మీ.లలోనే ఉంటాయి. చిన్నశంకరంపేట మండలం చందంపేటవాసులు దూరం తక్కువగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం చేగుంట మండలానికే వెళుతుంటారు. నారాయణఖేడ్‌ మండల కేంద్రానికి నిజాంపేట్‌ సుమారు 16 కి.మీ. దూరంలో ఉండగా పెద్దశంకరంపేటకు 3 కి.మీ.లలో ఉంటుంది. ఇదే రీతిలో వెల్దుర్తి మండలం మాసాయిపేట చేగుంట, తూప్రాన్‌ మండలాలకు, అదే మండలంలోని రామంతపూర్‌ చేగుంటకు సమీపాన ఉంటాయి. ఇలా ఒక మండలంలో ఉండి ఆ కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను దగ్గరి మండలాల్లో చేర్చేలా కసరత్తు సాగనుంది. ఇప్పటి వరకు మెదక్‌ రెవెన్యూ డివిజన్లో ఉన్న జిన్నారం మండలం సంగారెడ్డిలో చేరే అవకాశముంది. జిన్నారం మండలంలోని గుమ్మడిదల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం స్వగ్రామమైన చింతమడకను సైతం మండలం చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది. జూన్‌ 2 తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యశాల అనంతరం ఈ విషయమై మరింత స్పష్టత రానుంది

Post a Comment

0 Comments