Advertisement

జిల్లా ఖ్యాతి చాటిచెబుతున్న రచయితలు

ఉద్యమ పురిటిగడ్డ, సాహిత్యం వెల్లివిరిస్తున్న సిద్దిపేటలో వివిధ రకాల సంస్థలు సదస్సులు, సమావేశాలు, చర్చాగోష్టులెన్నో నిర్వహిస్తున్నాయి. భాష, సమకాలీన అంశాలు, వ్యవస్థలో దాగిన నిర్లక్ష్యాలపై నిలదీస్తూ చర్చలు చేపడుతుండటం గమనార్హం. మరోవైపు రచయితలు వినసొంపైన కవితలు, కథలతో ఆకట్టుకుంటున్నారు. వివిధ ప్రక్రియల్లో రచనలు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పుస్తకాలను వెలువరుస్తూ సాహిత్యానికి పట్టం కడుతున్నారు. భాష, సాహిత్యాన్ని ప్రజలకు దరిచేర్చుతూ.. వారిలో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలురకాల పురస్కారాలు కవులను వెతుక్కుంటూ వస్తున్న సందర్భాలు అనేకం. సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్నా పుస్తక పఠనం మరువొద్దని సూచిస్తున్నారు. మన ప్రాంతంలో పలువురు యువ రచయితలు సైతం తమ రచనా సామర్థ్యాలు పెంచుకునే దిశగా కసరత్తు చేయడం శుభపరిణామం. సిద్దిపేట ప్రాంతంలో 150 మందికి పైగా కవులు ఉండటం విశేషం. బాల సాహిత్యం, అభ్యుదయ, పద, గద్య సాహిత్యంతో పాటు కథా రచయితలు ఉన్నారు. ఆరుకు పైగా సాహితీ సంస్థలు కొనసాగుతున్నాయి. సందర్భానుసారంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏటా ఇక్కడి నుంచి సుమారు 25 పుస్తకాలు వెలువడుతున్నాయి.

పెరుగుతున్న ఆదరణ..
సాంకేతికతంగా దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో పుస్తక ప్రదర్శనలకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పటితో పోల్చిచూస్తే పుస్తక పఠనంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రచయితలకు ఆర్థికంగా, నైతికంగా ప్రోత్సాహ వాతావరణం కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన పుస్తక ప్రదర్శనలు. ప్రదర్శనల ద్వారా కొనుగోలుదారులకు అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైనవి తీసుకునే అవకాశం లభిస్తోంది. పరోక్షంగా చదివేందుకు, రాయడానికి ప్రోత్సహించినట్లే. తెలంగాణ భాష, యాసలో రాసిన పుస్తకాలు లభ్యమవుతుండటంతో సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినట్లవుతోంది. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో సిద్దిపేటలోనూ గతేడాది ఎన్జీవోస్‌ భవనంలో పుస్తక ప్రదర్శన జరిగింది.

‘మన’ పుస్తకాలు ఎన్నెన్నో..
హైదరాబాద్‌లో జరుగుతోన్న పుస్తక మహోత్సవంలో.. మన ప్రాంతానికి చెందిన పలువురు కవుల రచనలు పుస్తక రూపంలో ప్రదర్శితం అవుతున్నాయి. కవి ఐతా చంద్రయ్య రచించిన పల్లె నాతల్లి, ప్రజ్ఞాపూర్‌ చౌరస్తా, పొద్దు తిరిగింది కథా సంపుటిలు, త్రిబుజ్జి, కర్మభూమి నవలలు, మూల స్వరాలు కవితా సంపుటి, సోమనాథుడు, కుందేలు తెలివి బాల సాహిత్య రచనా పుస్తకాలు ఉన్నాయి. మరో కవి చొప్పదండి సుధాకర్‌ రచించిన వెన్నెల కుప్పలు కథా సంపుటి, జీవితం చేసిన సంతకం నవల, శబ్ద రుతువు కవితా సంపుటి సైతం ప్రదర్శనలో ఉంచారు. ఎన్నవెళ్లి రాజమౌళి రచించిన పది రూపాయలకు లక్ష వడ్డీ కథా సంపుటి, అమ్మమ్మ కథలు, ఎన్నవెళ్లి కథలు బాల సాహిత్యం, నేను కవితా సంపుటి ఉన్నాయి. విలాసాగరం రవీందర్‌ రచించిన బెజ్జంకి నానీల నిష్కలు, నానీల ప్రక్రియ పుస్తకాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. కవి కొండి మల్లారెడ్డి సంపాదకత్వంలో వెలువడిన సిద్దిపేట కథల సంకలనం, మరో కవి పర్కపెల్లి యాదగిరి రచించిన ‘గావు’ కథా సంపుటి ప్రదర్శనలో ప్రత్యేకతను చాటుతున్నాయి.

విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
ఇటీవల పలు పాఠశాలల్లోనూ సాహిత్యపరమైన అభిలాష పెరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ విద్యాసంస్థలు ముందంజలో నిలుస్తున్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు భాషపై పట్టు సాధించేలా.. పలు రకాల కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కథా రచనలతో ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు సృజనాత్మకతను వెలికితీస్తూ.. రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు.

Post a Comment

0 Comments