Advertisement

పయనం.. పథం.. లక్ష్యం స్వచ్ఛత

చరిత్ర తిరగరాసేందుకు..
2017లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో దేశవ్యాప్తంగా 500 పట్టణాలు పోటీలో నిలవగా, సిద్దిపేట 45వ ర్యాంకు సాధించింది. 2018లో లక్ష లోపు జనాభా విభాగంలో 3,737 పట్టణాలు పోటీ పడగా, దక్షిణాదిలో తొలి స్థానంలో నిలిచింది. 4 వేల మార్కులకు 3,060 సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో మూడు విభాగాల్లో 4 వేల మార్కులుండగా, ఈ సారి ఐదు విభాగాల్లో 5 వేల మార్కులు కేటాయించారు. సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చొరవతో గత రెండు సార్లు పట్టణవాసులు పరిశుభ్రత ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడి జాతీయ స్థాయిలో సిద్దిపేట కీర్తి పతాకాన్ని ఎగరేశారు. ఈ సర్వేలోనూ ఉత్తమ ర్యాంకు సాధించాలని బల్దియా అధికారులు, పాలకవర్గానికి ఈ పాటికే దిశానిర్దేశం చేశారు.

ర్యాంకింగ్‌లో ఇలా..
2017 - జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు
2018 - లక్ష లోపు జనాభా విభాగంలో దక్షిణాదిలో మొదటి స్థానం
2019 - 1-3 లక్షల విభాగంలో 321 పట్టణాలు పోటీ పడుతున్నాయి.



ప్రజా భాగస్వామ్యం కీలకం..
ఈ సర్వేలో ఉత్తమ ర్యాంకు సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకం.
* పట్టణంలో స్వచ్ఛత ఎలా ఉంది..? అన్న అంశంపై ప్రజలు వివిధ రూపాల్లో స్పందిస్తే మార్కులు కేటాయిస్తారు.

* ప్రజలు గూగూల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి mohua అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సిద్దిపేటలో దాదాపు 15 వేల మంది ప్రజలు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 5 వేల మంది చేసుకున్నారు. మిగిలిన వారు వెంటనే చేసుకోవాలి. మెదక్‌లో దాదాపు 5 వేల మంది ప్రజలు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 వేల మంది చేసుకున్నారు.

* పట్టణంలో స్వచ్ఛతకు సంబంధించిన ఏడు ప్రశ్నలు యాప్‌లో ఉంటాయి. వీటికి సమాధానాలు గుర్తించాలి. పట్టణంలో ఎక్కడ పారిశుద్ధ్యం సరిగా లేకపోయినా చిత్రం, వీడియా తీసి ఈ యాప్‌లో నిక్షిప్తం చేయాలి. బల్దియా అధికారులు నిర్దేశిత వ్యవధిలోగా పరిష్కరించాలి. ఈ అంశాలపై ప్రజా స్పందన, అధికారుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ప్రజలు దీన్ని విస్తృతంగా వినియోగించడంపై ప్రచారం చేయాలి.

* ప్రజలు స్వచ్ఛతపై రూపొందించిన లఘుచిత్రాలను (‌swachhmanch పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలి. దీని వల్ల ఆయా పట్టణాల్లో ప్రజల చైతన్యాన్ని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.

* జనవరి 4 నుంచి 31వ తేదీ మధ్యలో కేంద్ర ప్రతినిధి బృందం పట్టణాల్లో పర్యటించి డాక్యుమెంటేషన్‌, స్వచ్ఛత తీరు, పౌరుల స్పందనను ప్రత్యక్షంగా అంచనా వేయనుంది. ఈ అంశంపై జనం జాగరూకతతో వ్యవహరిస్తేనే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలం.

* 1969 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి పట్టణ స్వచ్ఛతపై అడిగే ఏడు ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది విజయవంతం అవుతుంది. జనవరి 4 నుంచి ఇది ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0 Comments