Advertisement

సిద్దిపేటలో 22 నుంచి వైమానిక దళ నియామక ర్యాలీ

భారత వైమానిక దళం ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నియామక ర్యాలీ (యువకులు) నిర్వహించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయనున్నట్లు డీఆర్వో చంద్రశేఖర్‌ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ యశ్వంత్‌, వారెంట్‌ అధికారి నరేంద్ర కుమార్కర్‌తో కలిసి వివిధ అంశాలపై శుక్రవారం సమన్వయ కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 22, 23 తేదీల్లో 15 జిల్లాలు, 24, 25న 16 జిల్లాల అభ్యర్థులకు ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఇంటర్‌ బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, 1998 జులై-14 నుంచి 2002 జూన్‌-28వ తేదీ మధ్య కాలంలో జన్మించిన వారు అర్హులని, ఎత్తు 152.5 సెం.మీ. ఉండాలని స్పష్టంచేశారు. అర్హులైన వారు 22న నిజ ధ్రువపత్రాలతో జిల్లా కేంద్రం సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 5 గంటల్లోపు హాజరు కావాలని సూచించారు. 6.30 నిమిషాల వ్యవధిలో 1.6 కి.మీ.ల మేర పరుగు పరీక్ష, అర్హత ఆధారంగా శారీరక సామర్థ్య, రాత పరీక్షలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనపు డీసీపీ నర్సిహారెడ్డి, డీఆర్డీవో నవీన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సరోజన, సంక్షేమ అధికారిణి జరీనబేగం, మైనార్టీ అధికారి జీవరత్నం, ఎస్‌సీసీ అధికారి రవికుమార్‌, ఎయిర్‌ఫోర్సు అధికారులు పాల్గొన్నారు.
source : eenadu

Post a Comment

0 Comments