Advertisement

సిద్దిపేటతో శ్రీకారం. దసరా రోజు జిల్లాను ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్‌ వెల్లడి




ప్రజలందరూ సంతోషించేలా కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని, వారికి మేలు కలిగేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలోని అవలక్షణాలు పోవాలని, అన్నింటా తెలంగాణ ఘనతను చాటాలని ఉద్బోధించారు. విజయదశమి రోజు కొత్తగా ఏర్పడే సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటానని కేసీఆర్‌ వెల్లడించారు. మిగిలిన కొత్త జిల్లాలను మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. వారు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా అర్హతగల వారందరికీ పదోన్నతులు కల్పిస్తామన్నారు. చిన్నచిన్న అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలన్నారు. సిబ్బంది అవసరాల కోసం కొత్త నియామకాలు చేపడతామని ప్రకటించారు. కొత్త జిల్లాలపై శనివారం రాత్రి ముఖ్యమంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌, సీఎం కార్యాలయ అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, స్మితాసబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అవలక్షణాలేవీ లేకుండా.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రభుత్వ శాఖలను పునర్‌వ్యవస్థీకరించాలి. గతంలోని పద్ధతులు, సంప్రదాయాలకు సంబంధం లేకుండా అన్ని శాఖలను ప్రజలకు చేరువయ్యేలా తీర్చిదిద్దాలి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా పరిపాలన సాగాలి. పథకాలు నూరుశాతం విజయవంతం కావాలంటే అన్ని శాఖల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఉండాలి. ఇందుకోసం ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి లబ్ధిదారుడి వివరాలు కలెక్టర్ల కంప్యూటర్లలో ఉండేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియను వినియోగించుకోవాలి. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు నేరుగా సంప్రదించే విధానం ఉండాలి.

ఉద్యోగులూ భాగస్వాములే 

గత ప్రభుత్వాల్లో మాదిరిగా ఉద్యోగులను దొంగల్లా భావించే పద్ధతి మన ప్రభుత్వంలో ఉండకూడదు. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో వారూ భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో వారిని చిన్నచూపు చూశారు. మేం వారికి అన్నింటా పెద్దపీట వేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో వారు పూర్తి నిబద్ధతతో ప్రజలకు సేవలందించాలి.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం 

శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలి. కొత్తగా ఏర్పడే మండల కేంద్రాల్లో పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన సిబ్బందిని నియమించాలి. ఈ నెల 6న జరిగే కలెక్టర్ల సమావేశంలో జిల్లాల పునర్విభజన పురోగతిని చర్చించి, ఆదేశాలు ఇస్తాం.
ఇదీ తెలంగాణ ప్రగతి 

సాగునీటిపారుదల, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశానికి ధాన్యాగారంగా ఉండాల్సిన తెలంగాణ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరవుతో తల్లడిల్లుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదలకు ఒకే ఒక్క ఏడాది అధికంగా రూ.15,500 కోట్లు కేటాయించారు. ఇప్పుడు తెలంగాణలో ఏడాదికి రూ.25 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 13 మంది చీఫ్‌ ఇంజినీర్లు ఉంటే ఇప్పుడు తెలంగాణకే 15 మంది ఉన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల వ్యవసాయ గోదాములుండేవి. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే 21 లక్షల టన్నుల గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టాం. పనులు వేగంగా సాగుతున్నాయి. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించడం సంతోషంగా ఉంది’’ అని సీఎం అన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కొత్త జిల్లాల కార్యదళ ఛైర్మన్‌ రాజీవ్‌శర్మ.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రికి నివేదించారు.


Post a Comment

0 Comments