సిద్దిపేట: జాతీయ విద్యామిషన్‌లో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలల్లో స్పోకెన్ ట్యుటోరియల్ అకడమిక్ రిసోర్సు కేంద్రాలు (స్టార్క్) మంజూరయ్యాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐఐటీ ముంబయికి ఈ ప్రాజెక్టును అప్పగించింది. ఇందులో భాగంగా ముంబయి ఐఐటీ సంస్థ ప్రతినిధి మహ్మద్ ఖాసింఖాన్, ఈ రెండు కళాశాలల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు.జి.బెన్‌కాక్‌తో మంగళవారం ఆయా కళాశాలల్లో వేర్వేరుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కింద ఆడియో, వీడియో ఉపకరణాలు, మెటీరియల్ ఇవ్వనున్నారు. కంప్యూటర్ నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో పాటు సమాచార, సాంకేతిక అంశాలపై ఉచిత శిక్షణ ఇస్తారు. సహాయ ఆచార్యులు, విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా మారనుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సౌజన్యంతో ఉచితంగా ఈ ప్రక్రియ చేపడతారు. జిల్లాలో త్వరలో మరిన్ని కళాశాలతో సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఐఐటీ ముంబయి ధ్రువపత్రాలు అందజేస్తుంది. కార్యక్రమాల్లో ఆయా కళాశాలల సహాయ ఆచార్యులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది.
0 Comments