Advertisement

ఉపాధిలో మేటి.. స్వచ్ఛతలో సాటి.. సిద్దిపేట జిల్లాకు మూడు పురస్కారాలు





ఓ వైపు అభివృద్ధిలో దూసుకెళ్తున్న సిద్దిపేట జిల్లాకు మరోసారి పురస్కారాలు వరించాయి.. ఉపాధి హామీ అమలులో భేష్‌ అనిపించుకుంటున్న సిద్దిపేట గ్రామీణ మండలం ఇబ్రహీంపూర్‌కు మరోసారి అవార్డు దక్కడం విశేషం.. అలాగే స్వచ్ఛతలో సైతం మాకెవరు సాటి లేరంటూ నంగునూరు మండలం వెంకటాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాల, మర్కూక్‌లోని ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిచి తమ విశిష్టతను చాటి చెప్పాయి. ఇటు పచ్చదనం పెంచడంలో, స్వచ్ఛతలో మేటిగా నిలిచి జాతీయస్థాయి పోటీలో నిలవడం గమనార్హం.
ఇబ్రహీంపూర్‌కు కేంద్రం ఆధ్వర్యంలో దిల్లీలో త్వరలో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డు అందనుంది. అలాగే రాష్ట్రస్థాయిలో పురస్కారాలు సాధించిన నంగునూరు, మర్కూక్‌ పాఠశాలల ప్రతినిధులు ఈ నెల 5న రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో అందుకోనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించి ఎవరూ వలస వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో మేటిగా నిలిచింది సిద్దిపేట గ్రామీణ మండలం ఇబ్రహీంపూర్‌. ఈ పథకంలో భాగంగా చేపట్టిన వివిధ పనులు ఆ పల్లె రూపురేఖలనే మార్చడం విశేషం. భూగర్భ జలాలను వృద్ధిలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతుల నిర్మాణం చేపట్టి.. రాష్ట్రం సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారి చూపును తనవైపు మళ్లేలా చేసింది. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌కు కేంద్ర ప్రభుత్వం గాంధీ జయంతి పురస్కరించుకొని ఏటా అందించే పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
పచ్చదనానికి తోడుగా..
పచ్చదనంలో సైతం ఈ గ్రామం తన ఆదర్శాన్ని చాటుకుంది. మొత్తం 2.50 లక్షల మొక్కలు నాటి.. హరిత చైతన్యానికి గ్రామస్థులందరూ జై కొట్టారు. హరితహారం రెండో విడతలో భాగంలో వీటిని నాటి సంరక్షించారు. ప్రస్తుతం పొలాల గట్లపై సుమారు 30 వేల టేకు మొక్కలు నాటగా వాటిని కాపాడుతున్నారు. దీనికి సంబంధించి నెల వారీగా ఉపాధి హామీ నిధులు స్థానిక 50 మంది రైతులకు అందుతున్నాయి. దీనివల్ల సంరక్షణ సైతం సులువుగా మారింది. అంతేకాక రాష్ట్రస్థాయిలో సంరక్షణకు గాను ఉత్తమ హరితమిత్ర అవార్డు గ్రామానికి చెందిన రైతు ఎల్లారెడ్డి ఇటీవల ఎంపిక కావడం మరో విశేషం..
అన్నదాతకు అండగా..
పథకంలో భాగంగా గ్రామంలో నిర్మించిన పశువుల పాకలు, నాడెపు కంపోస్టు పిట్స్‌, నీటి తొట్టేలు, సేద్యపు కుంటలు, నీటి నిల్వ గుంతల నిర్మాణాల్లో ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అంతేకాకుండా నమూనా పంచాయతీ భవనం, సీసీ రహదారులు, ఉద్యానం, శ్మశానవాటికల వంటి పనులను చేపట్టారు. మరోవైపు ఈ పథకంలో భాగంగా సుమారు రూ.లక్ష వెచ్చించి రైతులతో పందిరి సాగు చేయిస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది
- కుంబాల లక్ష్మి, తాజా మాజీ సర్పంచి
జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ నిధులను సమృద్ధిగా వినియోగించుకోవడంలో గ్రామస్థుల పాత్ర ఎంతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే పలు రకాల పనులు చేయడం వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారం ఎంతో ఉంది.

Post a Comment

0 Comments