Advertisement

సిద్దిపేట ప్రగతి బాట





ఉద్యమమైనా.. అభివృద్ధి అయినా.. సిద్దిపేటకు తెలిసింది దూసుకుపోవడమే..! ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా.. ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ముందంజలో నిలువడమే..! జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్‌రావు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం, అద్దాల్లా మెరిసే రహదారులు వేయడమే కాదు.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అర్బన్, హెర్బల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా సుందరీకరిస్తున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులకు మేలుచేసేలా సమీకృత మార్కెట్లు, మోడల్ రైతు బజార్లు నిర్మిస్తున్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ దేశానికే తలమానికంగా నిలిచింది. మెడికల్ కాలేజీ, హార్టికల్చర్ వర్సిటీ, అటవీ కళాశాల పనులు జోరందుకున్నాయి. అంతేకాదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వేలైన్ పనులు చకచకా కొనగుతున్నాయి. 


సిద్దిపేట ఉద్యమాల పురిటి గడ్డ ..! తెలంగాణ ఉద్యమంలో ముందుంది..! అభివృద్ధిలోనూ దూసుకెళుతుంది.. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పేరు తెచ్చుకుంది.. సిద్దిపేట స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు.. సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్‌రావులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో జిల్లాకు ప్రత్యేక స్థానం .. జిల్లా అభివృద్ధి పై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టడంతో అభివృద్ది సాధించింది.. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పనిచేసే నిరంతర శ్రామికుడు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశనం చేయడంతో జిల్లా ప్రగతి జోరు మీద ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 

శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న రైతాంగానికి సాగునీరు అందించాలనే దిశగా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయువేగంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్ధ్యంతో నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ తెలంగాణకు గుండెకాయ. జిల్లాలో ప్రధానంగా అనంతగిరి రిజర్వాయర్‌ను 3.5 టీఎంసీల సామర్థ్ధ్యంతో నిర్మిస్తున్నారు. దీని కింద 15,200 ఎకరాలకు సాగునీరందనున్నది. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను 3.0 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. దీనికి కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. దీని కింద లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరు పారిస్తారు. కొమురవెల్లి మల్లన్న సాగర్ కింద లక్షా 4 వేల ఎకరాలకు, కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ 5 జిల్లాల వరప్రదాయినిగా నిల్వనున్నది. దీని కింద 2లక్షల 85 వేల ఎకరాలకు సాగు నీరందిస్తారు. అన్ని రిజర్వాయర్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన కాల్వల నిర్మాణ పనులతో పాటుగా పిల్ల కాల్వల పనులు జరుగుతున్నాయి. మరి కొద్ది నెలల్లోనే రైతాంగానికి సాగు నీరు అందించే దిశగా ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. సొరంగం పనులు కూడా పూర్తయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి..

పునరావాస కాలనీలు 
జిల్లాలోని ప్రాజెక్టుల కింద ముంపు గ్రామాల వారికి పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తున్కిబొల్లారంలో కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలైన మామిడాలపల్లి, బైలాంపూర్, తానేదారుపల్లి గ్రామాలకు చెందిన 1,087 కుటుంబాలకు గజ్వేల్ పక్కన ముట్రాజ్‌పల్లి వద్ద, మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాలైన తొగుట (కొన్ని కుటుంబాలు), ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్టు, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవల్లి గ్రామాలకు చెందిన 3,319 కుటుంబాలకు, అంతగిరి రాజర్వాయర్ కింద ముంపు గ్రామమైన కొచ్చగుట్టపల్లి వాళ్ళకు సిద్దిపేట లింగారెడ్డిపల్లి వద్ద 145 కుటుంబాలకు పునరావాస గృహాల సముదాయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా వరకు పనులు పూర్తి దశకు వచ్చాయి. 

గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ 
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అత్యున్నత ప్రమాణాలతో ఎడ్యుకేషన్ హబ్‌ను నిర్మించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. సుమారుగా రూ.146.28 కోట్లతో విద్యా హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 20 ఎకరాలలో బాలికల కోసం, బాలురు కోసం కిలో మీటరు దూరంలో 40ఎకరాల్లో విద్యాహబ్‌ను సువిశాలమైన తరగతి గదులు, భోజన శాలలు, గ్రంథాలయాలు, ల్యాబ్‌లు నిర్మించారు. 1200మంది విద్యార్థుల సామర్థ్యంతో ఆడిటోరియాన్ని నిర్మించారు. నాణ్యమైన రోడ్లు, ఆధునిక రీతిలో నీటి సరఫరా, శానిటేషన్స్ ఏర్పాటు చేశారు. ప్లేగ్రౌండ్ తదితరవి తీర్చిదిద్దారు. విద్యాహబ్‌లో ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యాబోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధన కొనసాగుతున్నది. రాష్ట్ర స్థాయి సిలబస్‌ను కొనసాగిస్తారు. 

మినీ ట్యాంక్ బండ్‌గా చెరువులు


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. ఈ పథకంలో ప్రతి యేటా 20 శాతం చెరువులు పునరుద్ధరించడంతో పాటు నియోజకవర్గానికో చెరువును మినీట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే సిద్దిపేట కోమటి చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, దుబ్బాక రామసముద్రం చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, చేర్యాల పెద్ద చెరువులను సుందరీకరణ చేపట్టారు. సిద్దిపేట కోమటి చెరువు యోగా కేంద్రం, అడ్వెంచర్ పార్క్, ఓపెన్ ఆడిటోరియం, అమెరికన్ బోట్, వాకింట్ ట్రాక్, బ్యాటరీతో నడిచే కారు, సంగీత వాయిద్య పరికరాలు.. చుట్టూ నెక్లెస్ రోడ్.. ఇలా సకల హంగులు సంతరించుకొని రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. అదే తరహాలో రూ.18కోట్లతో గజ్వేల్ పాండవుల చెరువును ఆధునీకరిస్తున్నారు. పార్క్, వాటర్ పౌంటేన్లు, చిన్నారులకు ఆట వస్తువులు, పెద్దలకు జాకింగ్, వాకింగ్ ట్రాక్.. ఇలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దుబ్బాక రామసముద్రం చెరువు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాదు నాచారంలోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ సమీపంలోని హల్దీ వాగును రూ.7.48 కోట్లతో, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు రూ 22 .72 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు.



సమీకృత మార్కెట్లు
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం పంట వేసే దగ్గరి నుంచి మార్కెటింగ్ చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ఉపయోగంగా ఉండేలా.. కూరగయాలు, పూలు, పండ్లు, మాసం ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట మార్కెటన్లు నిర్మిస్తున్నది. ఇప్పటికే సిద్దిపేటలో రూ.20 కోట్లు, గజ్వేల్‌లో రూ.20 కోట్లతో చేపట్టిన రెండు సమీకృత మార్కెట్లు పూర్తయ్యాయి. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. గజ్వేల్‌లో ఉన్న ప్రస్తుత మార్కెట్‌కు అదనంగా పత్తి రైతుల కోసం 22 ఎకరాల్లో ఆధునాతన మార్కెట్ యార్డును నిర్మాణం చేపట్టనున్నారు. సిద్దిపేటలో రూ.8 కోట్లతో దేశంలోనే అత్యంత మెరుగైన సౌకర్యాలతో నిర్మించిన అధునాతన రైతు బజారు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి చూసి వెళ్ళుతున్నారు. రాజీవ్ రహాదారిపై పాతూరు వద్ద రూ.కోటి 25 లక్షలతో రైతు మార్కెట్ నిర్మాణం చేశారు. దీని పక్కనే మొక్కజొ కంకుల విక్రయం కొరకు ప్రత్యేకించి మార్కెట్ పక్కనే అదనపు నిర్మాణం చేపట్టారు. అంతేకాదు ధాన్యం విక్రయానికి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నిలువ చేసేందుకు ప్రతి మండల కేంద్రంలో గోదాములను నిర్మిస్తున్నారు. జిల్లాలో రూ. 63 కోట్ల నిధులతో లక్షా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 23 గోదాములను నిర్మించారు. 

ఆరోగ్యం పంచే అర్బన్ పార్కులు
గజ్వేల్ పట్టణ శివారు సంగాపూర్ అటవీ ప్రాంతంలో 295 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్కు నిర్మాణం కొనసాగుతున్నది. ఇందులో రాశి, నక్షత్ర వనాలతో పాటు యోగా, ధ్యాన మందిరాలు, సైక్లింగ్, పిల్లల ఆటలకు సంబంధించిన ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి పరమైన స్థానిక అనేక రకాల చెట్ల వృద్ధి, మరెన్నో రకాల వృక్ష జాతులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే గజ్వేల్ పట్టణ సమీపంలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద కోటి రూపాలయతో హెర్బల్ పార్కును నిర్మించారు. మర్పడగ శివారులో గల అటవీ ప్రాంతంలో అర్బన్ ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. 

మెడికల్ కళాశాల
మెడికల్ కళాశాల శాశ్వత భవనాన్ని నిర్మించడానికి ముందు సిద్దిపేట ఏరియా దవాఖాన ఆవరణలో తరగతుల నిర్వహణ, రోగులకు వైద్య సేవలు అందించేందుకు రూ.20 కోట్లతో 300 పడకల దవాఖానను నిర్మించారు. మెడికల్ కళాశాల నిర్వహణకు శాశ్వత భవనాల నిర్మాణం, జీతాల నిర్వహణ, ప్రొఫెసర్ల నియామకం కోసం 2017 సంవత్సరంలో రూ.715 కోట్లు కేటాయించి మెడికల్ కళాశాలలో పనిచేసే సిబ్బంది పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.135 కోట్లతో నిర్మించే భవనాలకు 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణంలో మెడికల్ కళాశాల సిబ్బంది, ప్రొఫెసర్ల క్వార్టర్స్ నిర్మాణం 600 పడకల దవాఖానతో బాయ్స్ అండ్ గర్ల్స్ వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు దవాఖానల స్థాయిని పెంచింది. రూ.21 కోట్లతో గజ్వేల్ సీహెచ్‌సీని 50 పడకల నుంచి 100 పడకలకు, రూ.8.20 కోట్లతో నంగునూరు పీహెచ్‌సీని 50 పడకల సీహెచ్‌సీగా, రూ.3.20 కోట్లతో హుస్నాబాద్ పీహెచ్‌సీని సీహెచ్‌సీగా, రూ.18.50 కోట్లతో దుబ్బాక దవాఖానను అప్‌గ్రేడ్ చేశారు. 

రహదారులకు మహర్దశ
జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రోడ్లకు పెద్దఎత్తున నిధులను మంజూరు చేసి రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతోపాటు విస్తరించింది. బ్రిడ్జిల నిర్మాణం, సీసీ రహదారులు వేసి అంతర్గత గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా చేయడానికి రూ. 510కోట్లు కేటాయించి పనులు చేపట్టి పూర్తి చేసింది. గజ్వేల్ రింగు రోడ్డు, రేడియల్ రహదారి పనులను నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడానికి రూ.223 కోట్లు మంజూరు చేయడంతో ఆ పనులు పూర్తి దశకు వచ్చాయి. సిద్దిపేట అవుటర్ రింగు రోడ్డుకు రూ.50కోట్లతో పనులు పూర్తి కావచ్చాయి. జిల్లాలో నాబార్డు, ఇతరత్రా నిధులు కలుపుకొని రూ.290కోట్లతో 60 పనులు చేపట్టగా అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో భారీగా నిధులు వచ్చాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయడంతో రవాణాకు రాచబాటలు పడ్డాయి. 


సిద్దిపేట అత్యాధునిక దోబీఘాట్ 
రాష్ట్రంలోనే మొట్టమొదటగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో అత్యాధునిక దోబీఘాట్ రూ.కోటి 50 లక్షలతో నిర్మించారు. మూడు రోజుల క్రితం ఈ దోబీఘాట్‌ను మంత్రులు జోగు రామన్న, హరీశ్‌రావులు ప్రారంభించారు. అత్యాధునిక దోబీఘాట్ నిర్మాణం కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.35.50 లక్షలు, సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి రూ.80 లక్షలు వెచ్చించారు.

ఇందులో తక్కువ వ్యవధిలో బట్టల నాణ్యత పోకుండా శుభ్రపరిచే అవకాశం ఉంది. పట్టణంలో 500 రజక కుటుంబాలకు ఉపాధి దొరుకుతున్నది. దోబీఘాట్‌లో 30 కిలోల కెపాసిటీతో 3వాషింగ్ మిషన్లు, 30 కిలోల కెపాసిటీ ఒక స్పిన్నర్, 15కిలోల కెపాసిటీ గల మరో రెండు స్పిన్నర్లు ఉన్నాయి. దీంతో పాటు రెండు డ్రైయ్యర్లు, స్టీమ్ బాయిలర్, క్యాలెండర్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక రోజులో 8 గంటలకు ఒక టన్ను కెపాసిటీ గల దుస్తులను శుభ్రపరుస్తున్నది. 

జోరుగా రైల్వే నిర్మాణ పనులు 
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా ప్రజల రైలు కల సాకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. జనవరి మాసం వరకు జిల్లాలో రైలు కూత వినపడనున్నది. మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేటల మీదుగా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు ఈ రైల్వేలైన్ 152 కి.మీ పొడవు ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో ఈ రైల్వేలైన్ 83.258 కి.మీ ఉంటుంది. రైల్వేలైన్ నిర్మాణానికి జిల్లాలో 1,413 ఎకరాల 23 గుంటల భూసేకరణ చేయాల్సి ఉండగా, 952 ఎకరాల 05 గుంటల భూమిని సేకరించి దక్షిణ మధ్య రైల్వేశాఖకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో మొదటి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు న్యూబ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాలోని వర్గల్, రాయిపోల్, దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, కొమురవెల్లి, కొండపాక, సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు మండలాల్లోని సుమారు 70 గ్రామాల మీదుగా రైల్వేలైన్ వెళుతున్నది. రెండో దశలో గజ్వేల్ నుంచి సిద్దిపేట జిల్లా సరిహద్దు వరకు రైల్వే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రెండో దశ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. రైల్వే సౌకర్యం ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి కానున్నది. 


హార్టికల్చర్ యూనివర్సిటీ 
ములుగు వద్ద సుమారు 26 ఎకరాల్లో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయం ఉద్యానవన పంటల అభివృద్ధిపై ఆసక్తి చూపడంతో కేంద్రం నుంచి ఉద్యానవన విశ్వ విద్యాలయంతో పాటు అటవీశాఖ కళాశాలకు 2015 జనవరిలో శంకుస్థాపన జరిగింది. భవన నిర్మాణ సముదాయాలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయంలో పలు రకాల పండ్లు జాతుల మొక్కలను అభివృద్ధి చేయడమే కాకుండా నూతన శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్నారు. ఈ మొక్కలపై పరిశోధనతో పాటు ఉద్యానవన పంటల అభివృద్ధికి స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త రకాలను రూపొందించడానికి వీలు కలుగుతున్నది. స్థానికంగా సాగు చేసే పలు కూరగాయల రకాల నర్సరీలను ప్లక్ పద్ధతిలో నర్సరీల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రైతులు కూరగాయల విత్తనాలు, నారుమళ్లు పెంచుకునే అవసరం లేకుండా ఈ నర్సరీ నుంచే నేరుగా మొక్కలు కొనుగోలు చేసుకొని నాటుకునే వీలు కలుగుతున్నది.


source:Namaste telangana

Post a Comment

0 Comments