Advertisement

Pass Port Office in Siddipet




సిద్దిపేటలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం
 సిద్దిపేట జిల్లాగా ఏర్పడ్డ తర్వాత ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సిద్దిపేట ప్రజలకు పాస్ పోర్ట్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కృషితో గతంలోనే పాస్ పోర్ట్ సేవాకేంద్రాన్ని మంజూరు చేయించారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి దశలో వరంగల్, మహబూబ్‌నగర్‌లో పాస్ పోర్ట్ సేవాకేంద్రాలు ఏర్పాటు చేయగా రెండవ దశలో మంజూరైన సిద్దిపేట పాస్ పోర్ట్ సేవాకేంద్రాన్ని ఈ నెల 28 న ప్రారంభించనున్నారు.
* ఎంపీ ప్రత్యేక కృషితో
మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేశారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి కేంద్ర మంత్రులను కలుస్తూ సిద్దిపేట ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి పనులు వివరిస్తూ పెరిగిన జనాభా ప్రకారం పాస్ పోర్ట్ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని పలుమార్లు కలిసి విన్నవించారు. ఇంతే కాకుండా గతేడాదిలో కేంద్ర టెలికాం శాఖ మంత్రిని కలిసి పాస్ పోర్ట్ కేంద్రం నూతన కార్యాలయం, మౌళిక వసతులను కల్పించాలని కోరారు. దీంతో సిద్దిపేటలో పాస్ పోర్ట్ సేవాకేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
* ప్రజల కష్టాలకు చెల్లు
సిద్దిపేట ప్రాంతంలో ఇతర దేశాల్లో చదువుకునేందుకు చాలా మంది విద్యార్థులతో పాటు, ఇతర రంగాల్లో బిజినెస్ చేసేందుకు, ఉద్యోగరీత్యా చాల మంది వెళ్తుంటారు. ఇందుకోసం పాస్ పోర్ట్ తప్పనిసరి అవసరముంటుంది. ఇందుకోసం హైద్రాబాద్ వెళ్ళి అక్కడే రోజంతా ఉండేవారు. గల్ఫ్ వెళ్ళే కార్మికులు పాస్ పోర్ట్ తీసుకోవడం తెలియక బ్రోకర్లను అశ్రయించేవారు. సిద్దిపేటలోనే నూతన పాస్ పోర్ట్ సేవాకేంద్రం ఏర్పడనుండడంతో ప్రజలకు రవాణా చార్జీలు తప్పడంతో పాటు సమయం ఆదా అవుతుంది. బ్రోకర్ల ప్రమేయం లేకుండా ప్రతి సామాన్య పౌరుడికి పారదర్శకంగా సేవలు అందనున్నాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నిర్ణీత సమయంలో పాస్ పోర్ట్ కేంద్రానికి వెళ్ళి తమ దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవపత్రాలను అందజేయాల్సి ఉంటుంది. నూతనంగా పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, సినీయర్ సిటిజన్లకు రూ.1350 చార్జీలు ఉంటాయి. అన్ని సౌకర్యాలతో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పడుతున్నందుకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు .

Post a Comment

0 Comments